4, మే 2023, గురువారం

నవ్వుచు నిలుచుందువు శ్రీరామచంద్ర

 
నవ్వుచు నిలుచుందువు శ్రీరామచంద్ర దవ్వుల నిలుచుందువు
రవ్వంత కనికరము శ్రీరామచంద్ర రాదేమి ననుచేరగ

నావాడవని నమ్మితి శ్రీరామచంద్ర నమ్మి నిన్నే కొలిచితి
భావింప సద్భక్తుల శ్రీరామచంద్ర బాధలు తీర్తువే కద
నీవాడ గానందువా శ్రీరామచంద్ర నీకింత పంతమేలరా
ఈవేళ కోపమేలరా శ్రీరామచంద్ర యేమని విన్నవింతురా

పదునాల్గులోకములను శ్రీరామచంద్ర పాలించువాడవే కద
వదలక నీగుణములు శ్రీరామచంద్ర వర్ణించు వాడనే కద
ముదమున భక్తకోటికి శ్రీరామచంద్ర మోక్షమ్మునిత్తువే‌ కదా
ఇదియేమి నన్నేలగ శ్రీరామచంద్ర యెందుకు దయరాదురా

నిక్కమ్ముగా నెప్పుడు  శ్రీరామచంద్ర  నీనామమే నుడువుదు
నిక్కమ్ముగా నెప్పుడు  శ్రీరామచంద్ర  నీకీర్తినే పొగడుదు
నిక్కమ్ముగా నెప్పుడు  శ్రీరామచంద్ర  నీసేవలే చేయుదు
చక్కని నాస్వామివి  శ్రీరామచంద్ర సంతోషముగ నేలర