31, మే 2023, బుధవారం

సంప్రీతిగ నీవాడనైతి సీతారామ

సీతారామ సీతారామ సీతారామ సం
ప్రీతిగ నీవాడనైతి సీతారామ

సీతారామ నీనామము చెన్నొందు నోటీతో
నేతీరున కీర్తింతు నితరుల నేను

సీతారామ నినుజూచు ప్రీతిగల కన్నుల
నేతీరున జూచెదనో యితరుల నేను

సీతారామ నీసేవల చెన్నొందు కరముల
నేతీరున సేవింతు నితరుల నేను

సీతారామ నీముందు నిలువగోరు చరణముల
నేతీరున నితరుల కడ నిలిచెద నేను

సీతారామ నీదగుచు చెన్నొందు తనువుతో
నేతీరున మ్రొక్కుదు నితరుల కేను

సీతారామ నీపాదసీమ నుండు మనసుతో
నేతీరున తలంచెద నితరుల నేను