4, మే 2023, గురువారం

దైత్యులైనందుకే దండించునా హరి

దైత్యులైనందుకే దండించునా హరి ధర్మమును తప్పిరని కాక
దైత్యులైనను భక్తవరులను శ్రీహరి దరిజేర్చుకొనుచుండు నెపుడు

దైత్యుడైనందుకే కనకకశిపుని హరి దయమాలి వధియించినాడా
దైత్యబాలకుడైన ప్రహ్లాదు నాహరియె దయజూపి రక్షించలేదా
దైత్యుడా కశిపునకు ప్రహ్లాదబాలకుడు తనయుడన్నది కూడ నిజము

దైత్యుడైనందుకే బలిని శ్రీహరి పాతాళంబునకు పంపినాడా
దైత్యు డాతని పాతాళకోటకు హరి ద్వారపాలకు డగుచు లేడా
భృత్యుడై తానుండె భక్తుడగు వాడొక దైత్యుడైనను నదియె నిజము

దైత్యుడైనందుకే పౌలస్త్యుని హరి దయమాలి వధియించినాడా
దైత్యుడు విభీషణుని శ్రీరాము డప్పుడు దయజూపి రక్షించలేదా
దైత్యుడా పౌలస్త్యు తమ్ముడు విభీషణుడు ధర్మాత్ముడని కాచె నిజము