11, మే 2023, గురువారం

ఓ మహనీయమూర్తి దయయుంచుము

ఉ.ఓ మహనీయమూర్తి దయయుంచుము రాఘవ రామచంద్ర యీ
బాముల సంఖ్య యొంతయగు వందలు వేలగు లక్షలౌననౌ
స్వామి యవన్నియుం గడచి వచ్చితి నేటికి నిన్నుచేరగా
భూమిని నాకు పుట్టువిక పుట్టనిరీతిగ జేయవే‌ ప్రభూ

రామచంద్రప్రభూ, రాఘవా ఇప్పటికి ఎన్ని జన్మలను ఎత్తిఉంటా నంటావయ్యా? ఎన్ని వందలో? ఎన్ని వేలో కావచ్చును. ఎన్నో లక్షలైనా కావచ్చును. పుట్టటమూ కర్మబంధాలలో చిక్కటమూ వాటిపుణ్యమా అని మళ్ళా పుట్టటమూను. ఇదే పనై పోయింది కదా నాకు!

ఐతే ఐనదిలే.

ఇప్పటికైనా ఒక దారిలో పడ్డాను. అన్నన్ని జన్మలను గడచి చివరకి నిన్ను చేరుకున్నాను. ఈచేరుకోవటం అనేది నాభక్తివిశేషంగా నేను అనుకొనే మాటగా మిగిలిపోతే ఎలాగు?

ఇకనైనా నాకు మళ్ళా పుట్టే అవసరమే పుట్టకుండా చెయ్యవయ్యా ప్రభూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.