11, మే 2023, గురువారం

ఇహపరసాధకమైనది తెలియగ

ఇహపరసాధకమైనది తెలియగ నీరఘురాముని కీర్తనము
బహుజన్మంబుల ఘనపుణ్యార్జనఫల మీరాముని కీర్తనము
 
మనసారా హనుమంతుడు చేయును మానక రాముని కీర్తనము
ఘనులగు యోగీంద్రులు నిత్యంబును గావింతురు హరికీర్తనము
మనసిజవైరియు మురియుచు చేయును మానక రాముని కీర్తనము
వనజాతాసనవాసవాదులకు ప్రాణము రాముని కీర్తనము 

ధనములకొఱకై వెంపరలాడుచు ధరను తిరుగువా రెరుగరిది
కనకాంగులపై భ్రమపడువారికి కానరాని ఘనసత్యమిది
తనువులు సత్యంబనుకొనువారికి మనసుల కెక్కని మాటయిది
వినుతశీలురగు సజ్జనులెప్పుడు వినయముతో‌ సేవించునది
 
రామా యని కీర్తించినంతనే రాలిపడునురా పాపములు
రామా యని కీర్తించినంతనే‌ కామితములు నెఱవేరునురా
రామా యని కీర్తించినంతనే క్షేమము సౌఖ్యము కలుగునురా
రామా యని కీర్తించినంతనే రాముని సన్నిధి కలుగునురా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.