11, మే 2023, గురువారం

నరులతీరు నానారకాలు

మధ్యాక్కఱ.
ఒక డిల భోగలంపటుడుగా నగు నొక్కడు కాడు
ఒక డన యోగిపుంగవుడుగా నగు నొక్కడు కాడు
ఒక డగు రామభక్తునిగ నొక్క డయోగ్యత నుండు
ఒకటగునా ప్రపంచమున నీనరు లుండెడి తీరు 

రామచంద్రప్రభో. ఈ ప్రపంచంలోని మనుష్యుల తీరుతెన్నులు రకరకాలు.

ఒకడేమో భోగలంపటుడిగా ఉంటాడు. ఎంతసేపూ ఏదో సుఖపడాలనే యావ తప్ప మరేమీ వాడి జీవితానికి పట్టదు. ఎవరన్నా ఈభోగాతురతకు ఆవల కూడా జీవించ వలసిన అగత్యమూ అవకాశమూ ఉన్నాయని వాడి చెవిలో ఇల్లుకట్టుకొని పోరినా అది.వాడికి కొంచెం కూడా ఎక్కదు.

కాని ఈలోకంలో ఇలాంటి భోగాసక్తులు ఉన్నవాడి లాగానే అవి లేని వాడూ కనిపిస్తూనే ఉంటాడు.

వాళ్ళలో ఒకడు యోగిపుంగవుడు కూడా ఖచ్చితంగా ఉంటాడు. మనకు తెలియవచ్చును. తరచుగా అస్సలు తెలియకపోవచ్చును.

భోగాసక్తి లేనివాళ్ళు అందరూ విరక్తులేనా అంటే కాకపోవచ్చును. కొందరు కేవలం భోగాసక్తి లేనట్లు కనిపించే వాళ్ళే కాని కేవలం అశక్తత వలననో సమాజం మెప్పుకోసమో అలా నటిస్తూ ఉండవచ్చును.

యోగులు అరుదే.

అలాగే ఒక్కొక్కడు రామభక్తుడుగా ఉంటాడు. మరొకడు కాడు.

తారకనామం చాలని తెలిసినా మనసారా నోరారా చేసే భాగ్యం అందరికీ రాదు. 

అవసరానికి మాత్రం గుడికి వెళ్ళే అయోగ్యులే ఎక్కువగా ఉంటారు లోకంలో. 

ఎంత చదివినా ఎంత తెలిసినా వారి జన్మాంతరసంస్కారం వారిని అయోగ్యులుగానే ఉంచుతోంది.

ఇలా నరుల తీరు నానారకాలుగా ఉంది.