2, మే 2023, మంగళవారం

స్వామీ‌ భవబంధములు పగులకుండేనా

స్వామీ‌ భవబంధములు పగులకుండేనా ఓ
రామచంద్ర నీకు దయరాకపోయేనా

నీనామమాహాత్మ్యము నెఱుగుదు నే
మానను శ్రీరామనామ మంత్రమెన్నడు
నీనామపు గొప్పనైన నిలుపుకొనుటకు నా
కేనాటికి నైన మోక్ష మీయకుందువా

ఇన్ని జన్మల తపఃఫలం బేమయ్యేను నా
విన్ని విన్నపంబు లివి యేమయ్యేను
ఎన్నాళ్ళని బిఱ్ఱబిగిసి యిటులుండేవు న
నెన్నెన్ని తిత్తులలో నిటు త్రిప్పేవు

పెద్దపెద్ద బిరుదులున్న వీరరాఘవా నీ
వద్దచేరి చెడిపోయిన వారెవ్వరు
ముద్దుగా నిప్పటికైన మోక్షమీయరా నా
హృద్దేశమందు వెలసిన నారాయణుడా