12, మే 2023, శుక్రవారం

మరలమరల పుట్టనేమిటికి శ్రీరామచంద్ర

మరలమరల పుట్టనేమిటికి శ్రీరామచంద్ర ధరను పాపిగ తిరుగనేమిటికి
కరకు యమునికి దొరుకనేమిటికి శ్రీరామచంద్ర మరలమరల చావనేమిటికి

తనువుపై నీమోహమేమిటికి శ్రీరామచంద్ర దానికిన్ని సోకులేమిటికి
ధనము నిజమని తలపనేమిటికి శ్రీరామచంద్ర దానికొరకై పరుగులేమిటికి

నిందలెన్నో పొందనేమిటికి శ్రీరామచంద్ర నిష్ఠురములకు క్రుంగనేమిటికి
కొందరు నను పొగడనేమిటికి శ్రీరామచంద్ర కొందరు నను తిట్టనేమిటికి

కోటిజన్మము లెత్తనేమిటికి శ్రీరామచంద్ర కూళనై నేబ్రతుకనేమిటికి
కూటివిద్యల నేర్వనేమిటికి శ్రీరామచంద్ర కూటికొరకై తిరుగనేమిటికి

కన్నుగానని గర్వమేమిటికి శ్రీరామచంద్ర విన్నదనమును పొందనేమిటికి
నిన్నుమరచి యుండనేమిటికి శ్రీరామచంద్ర యెన్ని యితరుల చెడగనేమిటికి

ప్రారభ్దము కరుగదేమిటికి శ్రీరామచంద్ర రామనామము నిలువదేమిటికి
కారుణ్యము చూపవేమిటికి శ్రీరామచంద్ర ఘనముగ నను బ్రోవవేమిటికి