4, మే 2023, గురువారం

చేయరే హరిభజన జీవులారా

చేయరే హరిభజన జీవులారా మీరు
చేరరే హరిపదము జీవులారా

చేరి నరుల సేవించి చింతలు వంతలు పొంది
మీరు సాధించే దొక మేలున్నదే
చేరి శ్రీహరిని గొల్చి చింతలన్నియు దీరి
మీరు స్వస్థితిని గొనుట మేలే కాదే

వెంటరాని ధనములకు వేడుకొనుచు నితరులను
తంటాలు పడు టెందుకు ధరమీదను
బంటులై హరికి మీరు భజనచేయు నెడల మీ
పంటపండి భవచక్రము బ్రద్దలు కాదే

చెడిపోవును తనువులు చెడిపోవును బంధములు
చెడిపోనిది కర్మబంధసమితి యన్నది
చెడగొట్టుడు దానిగూడ శ్రీరామనామముతో
చెడని మోక్షపదమునకు చేరుకొందురు