29, మే 2023, సోమవారం

రఘువర నిన్నే నమ్మితి నమ్మితి

రఘువర నిన్నే నమ్మితి నమ్మితి రామచంద్ర కరుణించవయా
అఘములు నీదయ వలన నశించును హరి ఆదయ నాఫై చూపవయా

గతజన్మంబుల చేసిన పాపము కరుణజూపి మన్నించవయా
గతజన్మంబుల చేసినపుణ్యము ఘనముచేసి లెక్కించవయా
ఆతులితకరుణామూర్తివి నీవని యందురు నను కరుణించవయా
ధృతిమంతుడనై నిను కీర్తింతును దేవా నను కరుణించవయా

గడచిన దినముల చేసినతప్పుల కరుణజూపి మన్నించవయా
నడమంత్రపుసిరులను నే కోరను నారాయణ దయజూడవయా
విడచితి సంసారముపై మోహము వేగమె నను దయజూడవయా
విడువను నీపదపంకజముల నిక వెన్నుడ నను దయజూడవయా

శక్తికొలది నిను సేవించెద నోహరి చక్కగ నను కరుణించవయా
రక్తిగొలుపు నీనామము విడువను రామా నను కరుణించవయా
భక్తుడ నిన్నే నమ్మినవాడను పరమాత్మా కరుణించవయా
ముక్తిప్రదాతవు మోక్షమడిగితిని మోదముతో కరుణించవయా 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.