12, మే 2023, శుక్రవారం

రామనామము రమ్యనామము

రామనామము రామనామము రమ్యనామము జనుల
పామరత్వంబనే రోగము బాపునామము

అవనిజాపతి దివ్యనామము - అమితమహిమలు గలుగు నామము
దివిజవరులే పొగడు నామము - దేవదేవుని ముఖ్యనామము
పవనసుతునకు ప్రాణనామము - పరమపావనమైన నామము
భవవినాశము చేయునామము - భవుడు మెచ్చిన రామనామము 
 
సుజను లెప్పుడుపాడు నామము - సురలనేలెడు రామనామము
విజయరాముని దివ్యనామము - వేదవేద్యుని సత్యనామము
కుజను లెఱుగని మంత్రరాజము - గొప్పపాపము లణచు నామము
అజ సుపూజిత మైన నామము - అఖిలసంపద లిచ్చు నామము


భువిని వెలసిన రామనామము - భూరిశుభముల గూర్చు నామము
భువనములనే యేలు నామము - పుణ్యప్రదమగు రామనామము
కవులు పొగడే రామనామము - ఘనతగలిగిన రామనామము
అవని దీనుల బ్రోచు నామము - అసురభయదంబైన నామము