31, మే 2023, బుధవారం

ఎన్నాళ్ళకు హరి ఎన్నాళ్ళకు

ఎన్నాళ్ళకు హరి ఎన్నాళ్ళకు నను పన్నుగ సంరక్షించితివి

ఎన్నాళ్ళకు నీనామమంత్రము నినకులతిలకా యిచ్చితివి
ఎన్నాళ్ళకు నాపూర్వపుణ్యముల నీశ్వర యిటు పండించితివి
ఎన్నాళ్ళకు యీసంసారార్ణవ మీదు నౌక నెక్కించితివి
ఎన్నాళ్ళు బహుకృపాపరుడని యింత ఋజువు చూపించితివి

ఎన్నాళ్ళకు కామాదిశత్రువుల నింటి నుండి వెడలించితివి
ఎన్నాళ్ళకు సంసారమోహమున నున్న నన్ను కరుణించితివి
ఎన్నాళ్ళకు నీదయయే బహుఘనమన్న స్పృహను కలిగించితివి
ఎన్నాళ్ళకు భవబంధవిమోక్షణ మన్ఞది దయతో చేసితివి 

ఎన్నాళ్ళకు శ్రీరామచంద్ర తగు యెఱుకను నాలో నించితివి
ఎన్నాళ్ళకు నీభక్తిసుధారస మింపుగ నను గ్రోలించితివి
ఎన్నాళ్ళకు నీభక్తిఫరులతో నించుక స్నేహము నిచ్చితివి
ఎన్నాళ్ళకు నీ సంకీర్తనసుఖ మెడతెగకుండగ నిచ్చితివి


1 కామెంట్‌:

  1. విన్నకోట నరసింహారావు గారి పౌత్రుడి ఉపనయన మహోత్సవానికి వెళ్ళాను. చాలా బాగా జరిగింది. అక్కడ ఉండగా వెలువడిన మొదటి రామకీర్తన యిది.

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.