22, మే 2023, సోమవారం

ఇది మేమిజీవిత మిట్లేల చేసితివి

ఇది మేమిజీవిత  మిట్లేల చేసితి వీశ్వర నాకీ శిక్షేమి
ఇది యెన్నినాళ్ళిట్లు కొనసాగవలె నింక నీశ్వర దీనికి యంతేది

రామనామము నందు రక్తిలేని పత్ని నేమని యిచ్చితి వయ్యా రామా
రామనామము నందు రక్తిలేని బలగ మేమని యిచ్చితి వయ్య రామా
రామా యంటే నవ్వు జనులమధ్య బ్రతుకు నేమని యిచ్చితి వయ్యా రామా
రామకీర్తన పాడు శక్తిలేని కంఠ మేమని యిచ్చితి వయ్యా రామా

ఏజన్మలో నెట్టి పాపమ్ము జేసితి నీజన్మలో నిట్లు పండినది
ఏజన్మలో నెవరి నెంతేడిపించితి నీజన్మలో నింత దుఃఖమాయె
ఏజన్మలో నెంతగర్వించి తిరిగితి నీజన్మలో నిట్టి దీనతకు
ఏజన్మలో  నెవరి నేడ్పించి నవ్వితి నీజన్మలో నవ్వు మాయమాయె

ననుగన్న నాతండ్రి నాదైవమా రామ వినవయ్య నామనవి నికనైనను
వనజాతాసనవాసవాదివినుత రామ బ్రహ్మాండనాయక పురుషోత్తమ
ఘననీలనీరదసుశ్యామ రామ వినతాసుతాతురగ వినవయ్య
వినవయ్య నామనవి విశ్వపోషక రామ విడిపించు మీచెఱను వేగముగ