3, మే 2023, బుధవారం

రాముని నమ్మినవాడే మనిషి

రాముని నమ్మినవాడే మనిషి రాముని కొలిచినవాడే మనిషి
రాముని మనిషై బ్రతికేవాడే భూమిమీద అసలైన మనిషి

వారికివీరికి సేవలుచేయుచు బ్రతికియు చచ్చెడు వాడొక మనిషా
కోరికలకు దాసానుదాసుడై నీరసించి చెడు వాడొక మనిషా
సారహీనమగు సంసారంబే చాలాసుఖంబను వాడొక మనిషా
ఊరకదుర్వ్యాపారములకు దిగి ఊరికి చెడుగగు వాడొక మనిషా

దిక్కుమాలిన ధనముల కొరకై దేవుని మరచే వాడొక మనిషా
ఎక్కడజూచిన దేవుడులేడని మిక్కిలివదరే వాడొక మనిషా
చక్కని తారకనామము చేయక సమయముగడిపే వాడొక మనిషా
దక్కిన ఈనరజన్మము వృథగా ధరపైతిరిగే వాడొక మనిషా

ఇతరులసొమ్ములు మెక్కనివాడై యితరుల పొట్టలు కొట్టనివాడై
యితరుల మెప్పును కోరనివాడై యితరుల నెప్పుడు వేడనివాడై
ధృతిమంతుండై దశరథసుతుడే దిక్కని గట్టి త్రికరణశుధ్ధిగ
ప్రతిదినమును హరి సేవల నుండుచు ప్రాణనాథుడని మదిలో నిత్యము