2, అక్టోబర్ 2021, శనివారం

అల్పుడనా యేమో యది యటు లుండనీ అల్పమా నానోట నమరిన నీనామము

అల్పుడనా యేమో యది యటు లుండనీ
అల్పమా నానోట నమరిన నీనామము

పదివేల జన్మలెత్తి బడసితినో యేమో 
యిది నా రసనపైన  నెంత నర్తించునో
పదిలముగ దీనినే పట్టుకొని యున్నానే
యిది యనల్పమే యని యెఱుగుదు గాన

మాయ నన్నెంతగా మభ్యపెట్టుచున్నను
చేయుదును రామ రామా యని నామమును
తీయని నీనామమె దేవదేవ భవమును
బాయుటకు దారియని భావింతు గాన

అల్పమైన చిప్ప యం దాణిముత్య మున్నటుల
అల్పత్వ మటుండ నా కబ్బెను నీనామమే
నిల్పుకొని నాలుకపై నే నుపాసింతునే
అల్పుడనా నేను మోక్షార్హుడను కాని