3, అక్టోబర్ 2021, ఆదివారం

రామనామము జగదారాధ్యనామము

రామనామము జగదారాధ్యనామము
రామనామము సర్వరక్షక నామము
 
హరినామము లందిదియే యత్యుత్తమ నామమని
హరుడు వక్కాణించినట్టి యందమైన నామము
పరమపావన నామమని భవతారక నామమని
ధరను పేరుకెక్కినట్టి దాశరథి నామము

ఓపరాని దుఃఖంబుల నూడ్చునట్టి నామము 
కోపమోహాదికదుష్ట గుణములణచు నామము
తాపత్రయంబుల పట్టి తరుము నట్టి నామము 
పాపలతాలవిత్రమై పరగునట్టినామము
 
సకలమునీశ్వరులు జపము సలుపుచుండు నామము
సకలభక్తవరులు పాడు చక్కనైన నామము
సకలలోకములకు సుఖసంవర్ధక నామము
సకలార్ధసిధ్ధికరము జానకీశు నామము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.