శ్రీరాముని మనసార కొలువరే చిత్తశాంతిని పొందరే
నీరసమైన శాస్త్రగ్రంథముల నిత్యము రుబ్బుట మానరే
ఆరూఢిగ శ్రీరామచంద్రుడే ఆశ్రీహరి గ్రహియింపరే
నారాయణుడే శ్రీరాముడని నమ్మి భజించిన మోక్షమే
నోరారా శ్రీరాముని నామము నుడువుచు సంతోషించరే
శ్రీరఘునాథుని నామభజనచే చింతలుడిగి ముదమందరే
భవతారకము రామనామమని బాగుగ నమ్మి తరించరే
రవికులపతి శుభనామ మొక్కటే ప్రాణప్రదమని యెంచరే
కువలయమున శ్రీరాముని నిత్యము కొలిచెడి వారతిధన్యులు
వివిధదేవతల గొలిచెడువారు వీరివలెను తరియించరు
శాస్త్రాధ్యయనము చిత్తశుధ్ధికి సాధనమై తగియుండును
శాస్త్రజడులు శాస్త్రంబుల కావలి సర్వేశ్వరుని కానరు
శాస్త్రజ్ఞుల పరిశోధనలకు హరి సర్వేశ్వరుడు చిక్కడు
శాస్త్రగ్రంథము లెంత రుబ్బినా జ్ఞానము లేశము కల్గదు
హరివిజ్ఞానము శాస్త్రజ్ఞానము లన్నిటి కంటెను గొప్పది
హరేరామ యని హరేకృష్ణ యని యానందముగా ననరే
హరి మీభవబంధము లూడ్చగ శ్రీహరిపదమే మీకబ్బును
హరేరామ యని హరేకృష్ణ యని యానందముగా ననరే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.