1, అక్టోబర్ 2021, శుక్రవారం

వింటిని వింటిని నీదయ గూర్చి విన్నది నిజమే ననుకొంటి

వింటిని వింటిని నీదయ గూర్చి విన్నది నిజమే ననుకొంటి
కంటికి కనబడు మంటే యెన్నడు కనరా కుండుట కనుగొంటి
 
అపదపాలై కరి శరణనగా అదుకొంటివని విన్నానే
ఆపదపాలై ద్రోవది మొఱలిడ ఆదుకొన్నకథ విన్నానే
ఆపదపాలగు నంబరీషు వెస నాదుకొన్నదియు విన్నానే
ఆపదలే నను చుట్టుముట్టినను నాహా పలుకవు రామయ్యా

పుట్టినదాదిగ పురుషోత్తమ నిను పొగడుచు నిట నిలుచున్నానే
పట్టుబట్టి నీ దరిసెనమునకై  ప్రార్ధనచేయుచు నున్నానే
ఒట్టులెన్ని నే పెట్టుకొన్న నీవోహో కనరాకున్నావే
యిట్టులైన నేనేమై పోవుదు నినకులతిలకా రామయ్యా

వింటిని భక్తవరదుడవు నీవని వెన్నుడ భక్తుడ నే గానా
వింటిని దీనజనాశ్రయుడ వని విన్నది నిక్కువమే కాదా
వింటి దయాబ్ధి వటంచును నదియడు గంటినదా నే డేమయ్యా
బంటుకు దయతో దరిసెన మీయవు భళిభళి ఓ రఘురామయ్యా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.