వట్టిమాట లెందుకయ్య పరంధాముడా మరల
పుట్టవు పొమ్మనుచు నా కొట్టుపెట్టరా
పదిపదులగు జన్మలుగను ప్రాకులాడు చుంటి గాని
పెదవివిప్పి యావరమును విదుపవుగా రామా
వదలలేక భవచక్రము భంగపడుచు నిన్ను
పదేపదే వేడుకొనెడు భక్తుని కరుణించవు
అడిగితినా ధనరాశుల నాశలతిశయించు చుండ
అడిగితినా పెత్తనంబు నందరిపైన నేను
గడువలేక భవబంధము కావమనుచు నిన్ను
విడిపించుమనుచు వేడ వినని యటులుందువు
మచ్చికతో పాటలువిని మామంచి దేవుడా
యిచ్చకంబు లాడి అవియివి యిత్తునందువు
ముచ్చటగా నింక నీవు పుట్టవనెడు మాటను
ఆచ్చుతుడా పలుకవయ్య ఆనందపడుదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.