4, అక్టోబర్ 2021, సోమవారం

దేవదేవ రామచంద్ర తెలిసికొంటిని

దేవదేవ రామచంద్ర తెలిసికొంటిని
భావనలో నీదైన పరమసత్యము

తీయతీయని దైన నీ దివ్యనామమే ఈ
మాయతెరల పాలిటి మంచిఖడ్గము
మాయతెరలు తొలగగా మహితసత్యమే
హాయిగా నిలిచెలే యంతరంగాన

పరమమంగళకరము నీ భవ్యచరితమే దు
ర్భరభవరుజకు మంచి రాజవైద్యము
విరిగి భవరుజ దేవా వేడుకతోడ
పరమాత్మ యెఱిగితినా స్వస్వరూపము

నీవు చేసిన మాయచే నిఖిలసృష్టిలో నీ
నీవు నేనను భావన నెగడుచున్నది
నీవు రాముడవు నేను జీవుడ గాని
దేవ నారూపు నీదు తేజోంశమే