2, అక్టోబర్ 2021, శనివారం

దిగిరారా దిగిరారా జగదీశ్వరా

దిగిరారా దిగిరారా జగదీశ్వరా
జగమున పౌలస్త్యమతము  చాలహెచ్చాయె

అవనీతలేశ్వరుండ నన్నమాట మరువకు
ప్రవిమలసత్కీర్తితో భాసించుట మరువకు
ఉవిదల రక్షించుట నీకొప్పు నది మరువకు
రవికులేశ వేగిరమే రారా రామా

భక్తులను పాలించగ వలయునని మరువకు
శక్తికొలది రాకాసుల జంపవలె మరువకు
ముక్తికోరి కొలుచెడు మాబోంట్లమాట మరువకు
యుక్తమే ధర్మరక్షణ మో రఘురామా

ఖలులుచేయు సాధుహింస ఖండించవలెనురా
కలి రావణుల చెలిమిని ఖండించవలెనురా
అలసత్వము జూప బిరుదు లన్నియును చెడునురా
తలపరా కర్తవ్యమును దశరథరామా



 




4 కామెంట్‌లు:

  1. రారా శ్రీ రామ అని ఉండాలి.
    యుక్తము అను దానిలో mo అనక రారారఘు rama
    బిరుదు lanniyu emoura ani ప్రశ్నార్ధకం గా
    చివర రారా దశరధ రామ అని ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు రామకీర్తనలను శ్రధ్ధగా చదువుతున్నందుకు సంతోషం. ఈతే మీ ధోరణిని గమనిస్తే నాకు కీర్తనలు వ్రాయటం నేర్పటానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది! చాలా సంతోషం. మీ అభిప్రాయాలు మీవి. కాదనను. తప్పక గౌరవిస్తున్నాను. అందులో సందేహం లేదు. కాని మీరు ఒక్క విషయం గమనించాలి. నాధోరణి అంటూ నాకు స్వంతమైన విధానం ఒకటి ఉంటుంది. ఎవరి దస్తూరీ వారిది అన్నట్లు అదీ దాని ప్రత్త్యేకత దానిదిగా భాసిస్తుంది. మీకు మరింత తెలిసి ఉండవచ్చును మంచిదే. మీరు చెప్పినట్లు మార్పులు చేయటానికి యత్నించానని అనుకోండి మాటవరసకు. అప్పుడు మరొక సహృదయులు మరొక విధంగా మార్చమంటారు. ఆ అవకాశం తప్పకుండా ఉంటుంది. మరి వారి సూచనలూ మన్నించాలి కదా మీవి మన్నించిన విధంగానే. మార్చుదాం అలా కూడా అనుకుందాం. చివరకు ఈవిధానం ప్రకారం ఇలా సోషల్ ఎడిటింగ్ చేసుకుంటూ పోతే అయ్యవారిని చేయబోతే కోతి ఐన చందంగా కీర్తనలు అతుకులబొంతలుగా అవుతాయి. ఈ రామకీర్తనాయజ్ఞం కమ్యూనిటీ రైటింగ్ కాదు. అటువంటి ప్రయత్నాన్ని నేను స్వభావరీత్యా హర్షించలేను. ఒక పూజ చేయటం అంటే మోడరన్ కమ్యూనిటీ పూజావిధానంలో పదిపాతిక మందికలిపి ఆపూజలో పాలుపంచుకొనటం వంకతో తలొకపనీ మాత్రం చేయటం అన్నమాట. అటువంటి పూజలో ఎవరూ పాపం ఆట్టే శ్రమపడరు. ఏమో ఇందులో లోకానికి ఏమి సారస్యం కనిపిస్తుందో కాని నాకు ఏమాత్రమూ సమ్మతంగా అనిపించదు. అందుచేత నా భక్తికొలదీ నాకు తోచినవిధంగా వ్రాసుకుంటున్నాను. కాని వీటిమీద అహంకారపూర్వకమైన కర్తృత్వకాంక్ష యేమీ లేదు. అంతా రామార్పణం ఆయన సంకల్పం అనీ‌ ఆయన వ్రాయించేవి అని నానమ్మకం. అది ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా చింతలేదు.అలా నడవనివ్వండి.

      ఒక్క మినహాయింపు ఉన్నది. ఎంతటి ఉపకరణమైనా చిన్నచిన్న లోపాలను కలిగిఉంటుంది కదా. అందుకని ఆయన వ్రాయించేది ఈవ్రాతలో పడేటప్పుడు భాషావ్యాకరణాల విషయంలో కాని, అన్వయాదుల యందుకాని దొసగులు దొర్లవచ్చును. అవి ఎవరైనా గమనించి సూచిస్తే తప్పక సరిజేయవలసినవే.

      తొలగించండి
  2. అవని అను దానిలో vannamata మాట మరువకు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.