28, అక్టోబర్ 2021, గురువారం

ఆకసపు వన్నె వా డఱుదైన విలుకాడు

ఆకసపు వన్నె వా డఱుదైన విలుకాడు
రాకాసుల నణచువాడు రామచంద్రుడు

శోకములు బాపువాడు సుఖములు చేకూర్చువాడు
ప్రాకటముగ సత్యధర్మపరాయణుడు
లోకముల నేలువాడు లోకేశులు పొగడువాడు
శ్రీకరుడు సకలలోక క్షేమంకరుడు 

శక్తి నొసగుచుండు వాడు సుజనులకు నిత్యమును
ముక్తి నొసగుచుండు వాడు ముముక్షువులకు
భక్తులకు నిత్యరక్ష ప్రసాదించుచుండు వాడు
యుక్తమైన వరములెల్ల నొసగు వాడు
 
యోగివరులు పొగడువాడు సాగి సురలు మ్రొక్కువాడు
భోగిరాజశయానుడు పురుషోత్తముడు
నాగురుడును దైవమగుచు నన్నేలుచు నుండువాడు
దాగియుండు వాడు నా హృదంతరంబున