1, అక్టోబర్ 2021, శుక్రవారం

లోకేశ్వరునే లోనెంచేవో శోకమోహములు నీకేవీ

లోకేశ్వరునే లోనెంచేవో శోకమోహములు నీకేవీ
లోకవృత్తములు లోనెంచేవో నీకు మనంబున శాంతేదీ

హరి హరి హరి యని హరినే తలచిన
చొరబడగలదా శోకము నీలో
హరిమోహములో నన్నియు మరచిన
ధర నేమోహము తగులును నీకు
 
తారకమంత్రము దాల్చిన మనసున
కోరికలేమియు చేరవు కాదా
శ్రీరఘురాముని చేరుట యొకటే
కోరదగిన దనుకొందువు గాదా

నిరంతరంబును హరేరామ యని
హరేకృష్ణ యని ఆనందించే
నరోత్తమునకు మరే కష్టములు
ధరాతలంబున తగులవు కాదా

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.