9, అక్టోబర్ 2021, శనివారం

మదిలో శ్రీరఘురాముని నామము మానక తలచండీ

మదిలో శ్రీరఘురాముని నామము మానక తలచండీ
అదియే భవతరణైకోపాయం బన్నది తెలియండీ 

పాపాటవులను రామనామము భస్మము చేయును నమ్మండీ
కోపాంధులకు రామనామము కూర్చును శాంతము నమ్మండీ

ఆపదలందున రామనామమే ఆదుకొనును మిము నమ్మండీ
తాపసులీ శ్రీరామనామమును తలదాల్చెదరని నమ్మండీ
 
హరబ్రహ్మాదులు కొలిచే రాముని యన్ని విధములుగ నమ్మండీ
మరి వేరేదైవములను కొలుచుట మంచిది కాదని తెలియండి

పరమమంత్రము రామనామ మను భావన విడువక యుండండీ
నిరంతరంబుగ రామనామమును నిర్భయముగ జపియించండీ
 
రాముని నమ్మిన వారికి కష్టము రానే రాదని యెఱుగండీ
మీమీ యోగక్షేమము లన్నీ రాముడు చూచును నమ్మండీ
 
శ్రీమన్నారాయణుడే రాముడు చిత్తము నందిది తెలియండీ
రాముడు కరుణాధాముడు త్రిజగద్రక్షకు డన్నది తెలియండీ