10, ఆగస్టు 2012, శుక్రవారం

కాలమా యది గడువక పోదు మేలు కీళ్ళను కుడుపక పోదు చాలు చాలిది జన్మజన్మల వేల మార్లే కంటిని రామ

edited 11/30/19
కాలమా యది గడువక పోదు మేలు కీళ్ళను కుడుపక పోదు
చాలు చాలిది జన్మజన్మల వేల మార్లే కంటిని రామ

తాళుకొమ్మని తరచుగా సద్గ్రంధములలో చదివి చదువక
మేలు కీడుల నొక్కటిగా చూడాలని లో తలచి తలచక
పాలు నీళుల సమముగా సంభావించుటను తెలిసి తెలియక
నేల నుండిన నాలుగు నాళ్ళు నీదు సత్యము నెఱిగి యెఱుగక

గురువు చెప్పిన సద్వాక్యములు కొన్ని మనసున‌ నిలచి నిలువక
పొరలుచు నీ భవపంకంబున సద్బుధ్ధి తనకు కలిగి కలుగక
తరచు విషయలోలు డగుచు ధర్మ మెదలో దలచి దలచక
పరమసత్యమగు విషయము నీవనెడు భావన కలిగి కలుగక

తానే నీవని నీవే తానని లోన చక్కగ నెఱుగుదాక
మానక యిటునటు తిరుగును కాని రానేరా డది తెలిసిన పిదప
ఈ మాత్రపు స్పహ యీశ్వర నీవే యీయక తనకు కలుగుట కల్ల
ఏమి చెప్పుదు కాలవాహినికి నిటునటు నీవే యెంచి చూడగ

original 8/10/12
కాలమా యది గడువక పోదు మేలు కీళ్ళను కుడుపక పోదు
చాలు చాలిది జన్మజన్మల వేల మారులు చూచితి రామ

తాళుకొమ్మని తరచుగా సద్గ్రంధములలో చదివి చదువక
మేలు కీడుల నొకటిగా చూడాలని లోపల తలచి తలచక
పాలు నీళుల సమముగా సంభావన చేయుట తెలిసి తెలియక
నేల నుండిన నాలుగు నాళ్ళు నీవె సత్యమని యెరిగి యెరుగక

గురువు చెప్పిన శాస్త్రవాక్యములు కొన్ని మనసులో‌ నిలచి నిలువక
పొరలుచు భవపంక మందున మంచి బుధ్దియె తనకు కలిగి కలుగక
తరచు విషయములు తహతహ బెట్ట ధర్మ మెడదలో దలచి దలచక
పరమసత్యమగు విషయము నీవని భావన లోపల కలిగి కలుగక

తానే నీవని నీవే తానని తాను చక్కగా యెరిగెడు దాక
మానక వచ్చుచు బోవును గాని మరియటు పిమ్మట రానే రాడు
ఈ మాత్రపు స్పహ యీశ్వర నీవే యిచ్చిన గాని వచ్చుట కల్ల
ఏమి చెప్పుదును కాలవాహినికి నీవల నావల నీవని యెరిగితి

1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.