11, అక్టోబర్ 2012, గురువారం

నా పని సులువు నీ పని సులువు

తాపత్రయమిది తప్పించితివా
నీ పాద సేవకు నియమించితివా
నా పని సులువు నీ పని సులువు 
యే పాటి పని నన్నేలుట నీకు

అన్ని లోకముల కేలిక వీవు
చిన్ని కోరికల జీవిని నేను
మన్నించి నా మనవి వింటివా
నిన్నిక దేనికి నే‌ పీడింతును

చావు పుట్టువుల సమరాంగణమున
లావు దక్కి నే లబలబ లాడుచు
కావు మంటిని కాని యూరక
నీ విశ్రాంతిని నేనడ్డుదునా

ఇరువుర మొకటని యెంత చెప్పితివి
ధరపై విడచి తప్పుకుంటివి
మరల స్వస్వరూపమహితజ్ఞానమును
కరుణించవయా పరమపురుషుడా


4 కామెంట్‌లు:


  1. ఇరువురం ఒకటే అని చెప్పినా,
    ఆ ఒకటి ఒకటి సంపూర్ణం కాదు శ్యామలీయా,
    నీ వొకటి, నావొకటి వేరయా
    పరమ పురుషుడు(same same but not same!) అంటున్నట్టు ఉన్నదండీ మాష్టారు మరి ఏమి చేద్దా మంటారు ?

    అనంతాన్ని చేరినా అనంతం ఇంకా సాగుతూనే ఉందాయే మరి !

    జిలేబి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వస్వరూపావబోధ కలిగేవరకూ ఎంతటి వైరాగ్యంలోనూ జీవప్రతీక యెంతో కొంత ఉండక తప్పదండి. దానికి అవిద్య కారణంగా యేర్పడే అహమిక (నేను అనే భావన) కారణం. ఆ బీజం దగ్ధం అయిపోయాక ఇక యేక మేవా అద్వితీయం బ్రహ్మ - తత్వమసి.

      తొలగించండి
  2. నాన్ యార్! తెలుసుకోమన్నారు భగవాన్ రమణులు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.