15, సెప్టెంబర్ 2012, శనివారం

దోసమెంచక చాల దుడుకుతనము చూపి

దోసమెంచక చాల దుడుకుతనము చూపి
మోసగించి బంధించి మురియు శరీరమా

ఇలను చూడ వచ్చినే నిచట చిక్కుపడితిని
కలిగిన యీ‌ భవము నుండి తొలగ లే నైతిని
పలుచ నైన యీ సుఖానుభవము నా కెందుకు
వలచి యీ ఆత్మ నేల పట్టి బంధించితివి

ఈ నీ కపటేంద్రియంబు లేపాటి రజ్జువులు
పోనీ నీ మమతల వల పొంక మేపాటిది
నే నా శాశ్వతుడను నీవు మట్టి బొమ్మవు
నా నిజతత్వమును తెలియ నట్టి యజ్ఞానివి

నీకు నాకు లడాయి నీ వలననె మొదలాయె
నాకు నీ‌ బడాయి నాటి నుండి యెఱుకాయె
నీ కట్టడి చెల్లదని నీ వెఱుగుట మంచిది
నాకు నా రామునకు నేకత్వము నెఱుగుము


5 కామెంట్‌లు:

  1. శరీరం బంధించకపోతే మనసెటుపోతుందండి:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి ప్రశ్న వేశారు.
      ఇక్కడ శరీరం అంటే ఉపాధి.
      ఉపాధి బంధనాలనుండి విడివడటం అంటే విదేహస్థితి.
      ప్రకృతి కూడా లయమై పోతుంది కాబట్టి దేశకాలాదులు కూడా ఉండవు.
      ఆ స్థితిలో కేవలం కేవలం ఆనందస్వరూపుడై ఉండటం జరుగుతుంది.
      అనన్యమైన ఆ కైవల్య స్థితిలో కేవల పరబ్రహ్మస్వరూపుడైన తనకు అన్యమైన దేశకాలాలు అన్యమైన వస్తువులూ ఏమీ‌ ఉండవు. ఎక్కడికీ పోవటం అన్న ప్రశ్నయే ఉదయించదు.

      తొలగించండి
  2. శ్యామలీయా,

    నేను నిన్ను బంధించ లేదయా
    నీవే నేనను కుంటున్నావు
    నేను నీవు కాదు, నీవు నీవే,
    అని శరీరం జవాబు చెప్తోందండీ శ్యామలీయం వారు.

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  3. బంధాలు కష్టమే...చిత్రం వాటిని వదులుకోనూ లేము
    చాలా బాగా వ్రాసారు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.