ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియంతమర్ధం
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
భవేభవే మేఽస్తు భవత్ప్రసాదాత్
భావం:
ఓ ముకుందా!
శిరస్సు వంచి ప్రణామం చేసి నేను నిన్ను యాచించేది ముఖ్యంగా ఒకటే!
నాకు యిలా జన్మ లెత్తటం యెలాగూ తప్పేలా లేదు. పోనీలే!
రాబోయే ప్రతిజన్మలోనూ కూడా నీ పాదారవిందాలను యెట్టి పరిస్థితుల్లోనూ నేను మరచి పోకుండా ఉంటే అదే నాకు చాలు.
నాకు దయ చేసి అటువంటి చక్కని వరం అనుగ్రహించు.
ఆ వరం చాలు నాకు. ఇంకేమీ అవుసరం లేదు.
స్వేఛ్ఛానువాదం::
తే.గీ. శిరసు వంచి విన్నపమును చేయు చుంటి
జన్మజన్మంబు లందు నీ చరణములను
మరువ కుండగ సేవించు వర మొకండు
కరుణతో నిమ్ము తండ్రి నా కదియె చాలు.
( ఈ పద్యం చివరి పాదంలో అఖండయతి వచ్చింది. లాక్షణికుల్లో అఖండయతి పట్ల భిన్నాభిప్రాయా లున్నాయి. చాలా మంది దీన్ని ఒప్పుకోరు. ఒప్పుకున్న వాళ్ళల్లోనూ ఉద్దండులున్నారు - ఉదాహరణకు ఆంధ్రవాల్మీకి బిరుదాంకితులు శ్రీ వావిలకొలను సుబ్బారావుగారు!. అయితే ఇక్కడ అఖండయతి రావటం కేవలం యాదృఛ్ఛికం.)
బాగుందండీ, తెలుగు పద్యం తేటగీతి. మరి సంస్కృత శ్లోకం ఏ ఛందస్సండీ? సంస్కృతం లో ఛందస్సులున్నాయా?
రిప్లయితొలగించండి