25, ఆగస్టు 2011, గురువారం

మంత్రం

వేనవేల మంత్రాలు వెలుగులీనుతున్నాయి
విమలబీజాక్షర వివిధవర్ణ విన్యాస సంరంభాల మధ్య
దివ్యాత్మవివిధాకృతులతో దిక్కుల నతిక్రమిస్తున్నది
చిన్మూర్తి హేలగా చిందులు తొక్కుతున్నది
వెలుగు లక్షరాల జిలుగు వలువలు దాల్చి
మంత్రస్వరూపాలుగా మహిత వాఙ్మయ మహా
లోకాభివ్యక్త ముల్లోక రక్షాదీక్షాపరాయణ
దేవీ స్వరూపాలుగా నిత్యం తేజరిల్లుతున్నాయి.

అసంఖ్యాక జనులు మంత్రాన్ని పఠిస్తున్నారు
వారిలో అనేకులు ఆ మంత్రాన్ని జపిస్తున్నారు
అందులో కొందరు ఆ మంత్రార్ధాన్ని ధ్యానిస్తున్నారు
వారిలో కొందరే ఆ మంత్రతాత్పర్యాన్ని గ్రహిస్తున్నారు
బహుకొద్ది మందికే ఆ మంత్రం ఫలిస్తున్నది
కాని ఒకరిద్దరికే ఆ మంత్రం వశమౌతున్నది
పరమపురుషుడిని తెలిసికొన్న వాడెవడో
వాడికి ఆ మంత్రం స్వస్వరూపమే అవుతున్నది.

మనస్సును అవిద్య నుండి మరలించేది మంత్రం
తమస్సునుండి ఆత్మను తప్పించేది మంత్రం
దివ్యచైతన్యరూపమై తేజరిల్లేది మంత్రం
సకలకర్మబంధాల్ని చక్కదిద్దేది మంత్రం
దేహప్రవాహాలనుండి దివ్యాత్మనుధ్ధరించేది మంత్రం
సర్వాత్మనా ప్రియమైన నా స్వస్వరూపం మంత్రం
అనంతకాలంలో అనేక దేహాల్లో తపించి తపించి
తన్మంత్రమూర్తిని నన్ను నేను తెలుసుకున్నాను
(2010-12-28)

2 కామెంట్‌లు:

  1. మంత్రానికి ఉన్న విలువ.శక్తి.వశ పరచుకోడానికి ఉండాల్సిన అర్హతలు...అన్ని బాగా విడమరిచి అద్భుతంగా వ్రాశావు...చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  2. మంత్రానికి ఉన్న విలువ.శక్తి.వశ పరచుకోడానికి ఉండాల్సిన అర్హతలు...అన్ని బాగా విడమరిచి అద్భుతంగా వ్రాశావు...చాలా బాగుంది

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.