6, జులై 2026, సోమవారం

హరేరామ యన్నావా హరేకృష్ణ యన్నావా


హరేరామ యన్నావా హరేకృష్ణ యన్నావా

మరేమనక పోయినా తరించేవులే


హరిభక్తుల జేరి హరికీర్తన జేసి

హరికీర్తన లల్లి మురిసేవులే

హరినామ జపము హరికొరకై తపము

హరికొరకే బ్రతుకై మురిసేవులే


హరి శాస్త్రము లరసి హరిపూజల మెరసి

హరికథల జదివి మురిసేవులే

హరిలీలల దలచి హరిసన్నిధి వలచి

హరి నదియే వేడి మురిసేవులే


హరిపురము జేరి హరిసన్నిధి జేరి

హరితోనే ముచ్చట లాడేవులే

హరిసన్నిధి విడచి ధర కికపై నడచి

మరలి రావు నీవు మాకెరు కేలే



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.