3, జులై 2026, శుక్రవారం

కొత్త గురువులూ కొత్త మతాలూ కొత్త దైవములు వద్దండీ


కొత్త గురువులూ కొత్త మతాలూ
కొత్త దైవములు వద్దండీ
కొత్తకొత్త వేషాలను వేస్తే
చిత్తుగ చెడిపోయే రండీ

ఎంతగ చదివిన గురుచరితములు
ఏమీ లాభము లేదండి
సంతతమ్ము భాగవతము చదివిన
ఎంతో ఫలితము కలదండీ
ఎంతగ ఆగురుభజనలు చేసిన
చింతలు తీరవు సుమ్మండీ
సంతోషముగా హరిని స్మరించిన
చింతలు తీరును నమ్మండీ

కల్లబొల్లి ఉపదేశాలిచ్చే
కల్లగురువులను విడవండీ
నల్లనయ్య శుభ నామము నిచ్చే
చల్లని గురువును చేరండీ
కల్లగురువుల మహిమలు చాటే
కల్లగ్రంథములు విడవండీ
చల్లని శ్రీహరి మహిమలు చాటే
సద్గ్రంథములే చదవండీ

పరాకునైనను అన్యదైవముల
స్మరించరాదని తెలియండీ
హరేరామ శ్రీహరేకృష్ణ యని
అన్నివేళలను పలకండీ
పరాయి మతాల పాలైపోతే
బాగుపడేది హుళక్కండీ
హరినిస్మరించిన మోక్షము కలదని
నరులారా మది నమ్మండీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.