23, జులై 2026, గురువారం

హరేరామ యనరే శ్రీహరేకృష్ణ యనరే


హరేరామ యనరే శ్రీహరేకృష్ణ యనరే
హరినామేతరముల ననిన ఫలము లేదే

హరేకృష్ణ హరేకృష్ణ యనని వాని కర్మము
మరందమును మించు నామమధురిమనే యెరుగడు
హరేకృష్ణ హరేకృష్ణ యనెడు వాడు ధన్యుడు
హరినామమధురసరసి నతడే విహరించును

హరేరామ హరేరామ యనని వాని కర్మము
మరల మరల పుట్టు వాడు మరల మరల చచ్చును
హరేరామ హరేరామ యనెడు వాని భాగ్యము
మరల వాడు పుట్టకుండ హరిసన్నిధి నుండును

హరేరామ హరేకృష్ణ యనక భవబంధములు
మరి తొలగు నుపాయమే మహిలో కనరాదు
హరేరామ హరేకృష్ణ యనువానికి బంధమనగ
హరితోనే నిత్యమగుచు నలరారుచు నుండును


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.