12, ఏప్రిల్ 2019, శుక్రవారం

చాలు చాలు నీదయకు చాల పాత్రుడ నైతి


చాలు చాలు నీదయకు చాల పాత్రుడ నైతి
కాల మిటుల గడపి నిన్ను కలిసెద గాక

కోరుదునా యెన్నడైన కొఱగాని కోరికల
చేరుదునా నిన్ను దిట్టు చెనటుల తోడ
మీఱుదునా నీయాన మిన్ను మీద బడినను
కారుణ్యాలయ రామ కలలోన నైనను

పేరుబడ్డ మనుజులైన పెద్దదేవత లైన
వే రెవరిని నైన గాని వేడ నాకేమి పని
ఆరయ నీ వలన నే నన్నియును బడయుచు
శ్రీరామ నే నన్యుల చింతింప నేమిటికి

శ్రీరమారమణ నీవు శ్రీరామచంద్రుడవై
ధారుణి నీ భక్తజనుల దయతో పాలింపగ
భూరిగ నీ దయకు నోచి  పుడమి నీ వాడనై
యీరీతిగ నున్న చాలు నింకేమి వలయును