15, ఏప్రిల్ 2019, సోమవారం

ఏమను కొంటినో యెఱుగుదురా


ఏమను కొంటినో యెఱుగుదురా మీరు
నామనసున కప్పుడు రాముడే తోచె

పొగడదగిన వానినే పొగడుద మనుకొంటి
పొగడదగిన వాడు రామభూపాలు డొక్కడే
యగపడెను ముమ్మాటికి నందు నా తప్పేమి
పొగడకుండ నెటులుందు జగదీశ్వరుని

పురుషోత్తము డగు వాని పూజింత మనుకొంటి
పురుషోత్తము డనగ రామభూపాలు డొక్కడే
అరయ దెల్లముగ దోచె నందు నా తప్పేమి
హరి యనుచు శ్రీరాము నంద రెఱుగరే

అప్రమేయు నెన్ని యాత్మ నర్పింతు ననుకొంటి
అప్రమేయుడై తోచె నారాము డొక్కడే
అప్రమేయు డండ్రు హరి నందు నా తప్పేమి
సుప్రసిధ్ధవిషయ మిది సుజనులారా