9, ఏప్రిల్ 2019, మంగళవారం

మనసంత నీకే యిచ్చాను


మనసంత నీకే యిచ్చాను మనసులోని మాట చెబుతాను
కనికరించి నువ్వు వింటే చాలు కావలసిన దింకేమీ లేదు

ఎన్నెన్నొ వేషాలు వేస్తూ భూమిని ఎన్నో మారులు చుట్టాను
ఎన్నడు నాకే వేషంతోనూ సున్నంటె సున్నయె సౌఖ్యము
అన్నన్నా నేనింత మాత్రానికే యిన్ని వేషాలూ వేయాలా
తిన్నగ నేను కదలక తొల్లిటి స్థితిలో నుంటే పోయేదే

నీవేదో నన్నుపంపావనుకొని నేనీ భూమికి వచ్చాను
నీవు పంపక నేను కదలక లేవుగ నాకీ కష్టాలు
ఈ వింతనాటక మాడిం దెవరో నీవే నాకు చెప్పాలి
నీవు పిలిస్తే మళ్ళీ నేను నీదగ్గరకే వస్తాను

తెలిసీ తెలియక చేసిన తప్పును తెలిసిన నీవే దిద్దాలి
ఇలపై శ్రీరాముడవై వెలసి యెందరినో రక్షించావే
తలవంచి నీకు దండం పెడితే దయతో దరిజేర్చు కున్నావే
కలనైన నిన్నుమరువని నన్ను కాపాడగ రాకున్నావే


4 కామెంట్‌లు:

 1. ఇంకా బాగా వ్రాయవలసినది.
  ఆఖరు లైను అసలు అతకలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నీహారిక గారూ, మీరు ఇంత శ్రధ్ధతో ఈ రామసంకీర్తనం చదువుతున్నందుకు ఆనందిస్తున్నాను. మీ సూచన పరిగణనలోనికి తీసుకుంటున్నాను. మరలా పాడిచూసుకొని అవసరమైన మార్పు చేస్తాను.

   తొలగించండి
 2. పేలవంగా ఇది అనిపిస్తుంది. Instead of repairing it better to discard.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కీర్తనలేవీ నా సొత్తు కావండీ. చెత్తబుట్టలో వేసే అధికారం నాకు లేదు. నేను అందుకొన్న క్రమంలో లోపం ఏమైన జరిగితే అక్కడక్కడ స్ఖాలిత్యాలుండవచ్చును. అందుకు క్షంతవ్యుడను. కీర్తనలు 'బాగు' చేయటం అన్న దృక్కోణం అంతగా నాకు నచ్చదు. కాని పొరపాట్లు సవరించుతాను. ఎందుకంటే పొరపాట్లు నా వ్రాయసకానితనపు లోపాలు

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.