8, ఏప్రిల్ 2019, సోమవారం

కేసీఆర్ గారు సమయానికి తగుమాట లాడెనే.....


సమయానికి తగుమాటలు కేసీఆర్ గారు వల్లించారు.

ఈ మాటలను నేను జైగారు అక్కసుగానో ముధ్ధుముధ్దుగానో పచ్చమీడియా అనే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో మాత్రమే చదవలేదు.

సాక్షాత్తూ నమస్తే తెలంగాణాలోనూ చూసాను.

ఆంధ్రజ్యోతిలో ఐతే కేసీఆర్ దొరగారి గళంలోనే ఆ ఉవాచను ఆకర్ణించాను.

నమస్తే తెలంగాణా ఆన్-లైన్ ఎడిషన్ పత్రికలోని వార్త పాఠం ఇలా ఉంది.

వికారాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ పార్టీ సహకరిస్తుందని వికారాబాద్ టీఆర్‌ఎస్ సభలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడూ అడ్డం పడలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు లాంటి నేతలతో తప్ప ఏపీ ప్రజలతో మాకేం గొడవ లేదు. తెలంగాణ, టీఆర్‌ఎస్ పార్టీ తన మేలుతో పాటు ఇతరుల మేలు కూడా కోరుతది. చంద్రబాబు లాగా చీకటి పనులు చేయం. నీ లాగా పొద్దున్నే లేచి మందికి గోతులు తీయం. తెలంగాణకు కుట్రలు చేయడం రాదు. లోక్‌సభలోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రత్యేక హోదాకు మద్దతిచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ 16 సీట్లు.. ఎంఐఎం 1 సీటు గెలవబోతున్నది. ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.

చంద్రబాబు లాగా మేం అల్పులం కాదు. చంద్రబాబులాగా మాది నీచబుద్ధి కాదు. మాకు ఉదార స్వభావం ఉంది. మీకు పోలవరం కట్టడం రాలేదు. పోలవరం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆంధ్రా ప్రజలు మంచివాళ్లు.. వాళ్లతో మాకేం కిరికిరి లేదు. చంద్రబాబు లాంటి పిడికెడు మందితో తప్ప ఏపీ ప్రజలతో మాకు పంచాయతీ లేదు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా మాత్రమే అడుగుతున్నాం. గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. అందరూ బతకాలన్నదే మా సిద్ధాంతం. దేశాన్ని విడదీసి ఏం సాధిస్తారని కేసీఆర్ వివరించారు.

ఎన్ని చల్లని మాటలు.

కాని ఇవన్నీ నమ్మదగ్గ మాటలే అంటారా?

ఒకప్పుడు ఇదే కేసీఆర్ మహాశయులు

తెలంగాణా ఇస్తే తె.రా.స.ను మీ పార్టీలో విలీనం చేస్తానని కాంగ్రెసు వారిని ఊరించారు. ఎంత బాగా మాట నిలుపుకున్నారో అందరికీ తెలిసిందేగా

అలాగే తెలంగాణా వస్తే తొలి సారిగా తెలంగాణా రాష్ట్రముఖ్యమంత్రిగా ఒక దళితుడిని చేస్తానని పదేపదే చెప్పారు. ఆ మాటనూ ఎంత బాగా నిలుపుకున్నారో అందరికీ తెలిసిందేగా

పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి తీరుతాననీ లేకపోతే ఓట్లు అడగటానికి తెరాస రాదనీ కూడా ఢక్కా బజాంయించి చెప్పారు. ఆ మాటనూ ఎంత బాగా నిలుపుకున్నారో అందరికీ తెలిసిందేగా.

ఇక ప్రస్తుతానికి వద్దాం.

ఆంద్రప్రదేశ్‍కు గనక ప్రత్యేకహోదా ఇచ్చే పక్షంలో తెలంగాణాకూ ఆ హోదా ఇవ్వాలని ఒకప్పుడు అన్నారు కదా, ఇప్పుడు అంత తీవ్రతను మానుకొని ఆంద్రప్రదేశ్‍కు ప్రత్యేకహోదా ఇవ్వాలనీ దానికోసం కృషి చేస్తామనీ అంటున్నారు. నమ్ముదామా?

కొత్తగా తాము,  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడూ అడ్డం పడలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అదేమిటీ తెలంగాణా ప్రభుత్వం వారు పోలవరానికి మోకాలు అడ్డుపెట్టటం ఇప్పుడేదో ఎవరో అపోహ పడినట్లుగా అంటున్నారేమిటీ? నిజంగా అడ్డుపడ్డారు కదా? మాటవరసకు ఒక లింక్ చూపుతున్నాను.  Telangana govt objects to Polavaram irrigation project in Andhra Pradesh అన్నది.  పాతపత్రికలు తిరగవేస్తే తెలంగాణా వారు పోలవరం పైన కారాలూ మిరియాలూ నూరుతూ ప్రవర్తించిన తీరు అంతా తెల్లంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో సభలో అబ్బే ఎప్పుడూ సహకరించామే కాని అడ్డుపడలేదూ అంటే వినే వాళ్ళను అమాయకులను చేయటమా ఉద్దేశం? ఇప్పుడు "పోలవరం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది" అంటే నమ్మటం ఎలా గండీ?

ఈ మాట చూడండి "చంద్రబాబు లాంటి నేతలతో తప్ప ఏపీ ప్రజలతో మాకేం గొడవ లేదు". అహా! ఆంధ్రాలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణా ద్రోహులే అన్న ఉవాచలు దొరవారినుండో వారి పార్టీ పెద్దలనుండో కాక అంధ్రుల కలల్లోంచి వచ్చాయాండీ? ఏపీ ప్రజలతో ఏ పేచీ లేదూ వాళ్ళు మంచాళ్ళూ అని ఈరోజున కితాబు ఇస్తున్నారే, మరి ఆంద్రాలో పుట్టిన పాపానికి కదా, ఆ మంచాళ్ళల్లో కొందరు మహనీయుల విగ్రహాలు టాంక్ బండ్ మీద ఉంటే పూనకంతో విరగ్గొట్టారే! అదంతా ఆంద్రావాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సన్మానించటమేనా?  లేదా వాళ్ళంతా చంద్రబాబును సపోర్టు చేసారన్న అభియోగం కారణంగా ముక్కలు చేయబడ్డారా మరి? ఈరోజున అవసరార్థం "ఆంధ్రా ప్రజలు మంచివాళ్లు.. వాళ్లతో మాకేం కిరికిరి లేదు" అనటం మంచివాళ్ళు  వైసీపీకి ఓటువేస్తారు పాపం అని బుజ్జగించటం కాదూ? నిజంగా మంచివాళ్ళైన ఆంద్రావాళ్ళని ఉద్యమం పేరుతో దుర్భాషలాడిన కేసీఆర్ గారు ఈరోజున మంచివాళ్ళు మీరు అనగానే ఆయన మనస్ఫూర్తిగా అన్నారనుకొని అంద్రాజనం పొంగిపోయి ఆయన చెప్పిన వాళ్ళకు ఓటేయాలా చచ్చినట్లు. వేస్తే చచ్చినట్లే అని నా ఉద్దేశం.

ఈ సూక్తి చూడండి "అందరూ బతకాలన్నదే మా సిద్ధాంతం". ఎంత మంచి మాట! ఉద్యమం పేరుతో అవసరం ఐతే ఆంధ్రావాళ్ళు  అందరూ చచ్చి ఐనా తెలంగాణా ఇవ్వాలి అని ఈయన పార్టీవాళ్ళు అన్న మాటలు ఆంద్రాజనం మర్చిపోవాలన్నమాట. ఈ మాట కేసీఆర్ గారు అన్నారో స్వయంగా అనిపించారో కాని ఆమాట అప్పట్లో అన్నారు, ఆంద్రావాళ్ళు పడ్డారు.

ఇంకో ముక్క "చంద్రబాబు లాగా చీకటి పనులు చేయం". భేషైన మాట. అప్పట్లో ఆయన చేసిన చారిత్రాత్మికమైనది అని పొగడబడ్డ నిరాహార దీక్షా కార్యక్రమం అంతా ఒక డ్రామా అని గుసగుసలు వచ్చాయి. ఎంతవరకూ నిజమో తెలియదు కాని, అతిప్రమాదకరంగా ఉందాయన పరిస్థితి అని వార్త వచ్చి ఆవెంటనే తెలంగాణా ప్రకటన వచ్చి ఆ తక్షణం ఆయన కొత్తపెళ్ళికొడుకు లాగా టీవీఛానెళ్ళలో దర్శనం ఇవ్వటం అన్నీ బాగానే గుర్తున్నాయి జనానికి. దాన్ని బట్టిచూస్తే ఆయన  చేసిన నిరాహార దీక్ష ఒక పగటివేషమూ ఆయన ఒక చీకటిపనిగా ద్రవాహారాలు స్వీకరించారు అన్నది అసలు సంగతీ అనిపిస్తుంది. అసలు తెలంగాణా తీర్మానం పార్లమెంటులో ఆమోదించినదే ఒక చీకటి పనిగా. అదికూడా అందరికీ గుర్తుంది. ఇప్పుడు చీకటిపనులు చేయం అని సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా నమ్మేదండీ?

ఇది చూడండి "చంద్రబాబు లాగా మేం అల్పులం కాదు"? తనకు బద్ధశత్రువే కావచ్చును. రాజకీయప్రతిస్పర్థి ఐనంత మాత్రానా అల్పుడు అంటారా? అది రాజకీయ విజ్ఞతా? ఎవరన్నా అవును అంటే వారికో నమస్కారం. రేపు కేసీఆర్ గారికి కోపం వస్తే, ఆంద్రాజనం లాగా మేం అల్పులం కాదు అని కూడా అనగలరు. ఆయన నోటికి శుధ్ధి అనేది లేనే లేదు. సరే ఆవిషయం అటుంచండి. ప్రస్తుతం చంద్రబాబు ఆంద్రాకు ముఖ్యమంత్రి. అంద్రాముఖ్య మంత్రిని అల్పుడు అని తిట్టే వాడిని ఆంద్ర్హులంతా ఎలా మెచ్చుకోవాలీ? రేపు ఎవరు ఆంధ్రా ముఖ్యమంత్రి ఐనా తనకు అనుకూలంగా లేకపోతే అల్పుడూ అనే అంటాడు కదా? ఆలోచించండి.

ఈ ముక్క చూడండి "మాకు ఉదార స్వభావం ఉంది". ఆహా, లోగడ ఎంతో ఉదారస్వభావం తోనే కదా, అంద్రావారి ఆహారవిహారాలనూ హీనంగా ఎద్దేవా చేస్తూ ఈ మహాశయులు సభారంజకంగా మాట్లాడిందీ? ఆంద్రావారు బిర్యానీ చేస్తే పేడలాగా ఉంటుదన్న మాట వీరి ఉదారమైన స్వభావం కారణంగా వీరి పవిత్రవాగింద్రియ విలాసంగా వెలువండిందీ. ఆంద్రా వాళ్ళకు ఈబిర్యానీ తినటం ఖర్మమేమీ? వాళ్ళు హాయిగా పులిహోర చేసుకొని తింటారు. వెక్కిరించినంత మాత్రానా ఆంధ్రారుచులకు వచ్చిన లోపం యేమీ లేదు. ఇంకా చాలా చాలా మాటలు ఆనాటి ఉద్యమం వేడి పేరిటనే చాలా ఉదారంగా ఆంద్రావాళ్ళ మీద విసిరారు లెండి. అవన్నీ ఎలాగో మర్చిపోయి, ఇప్పుడు కేసీఆర్ గారి మంచిమాటను మెచ్చేసుకొని సంబరపడిపోవాలి, వారి ఉదారవాక్యవిన్యాసానికి. ఔరా!

పైగా "దేశాన్ని విడదీసి ఏం సాధిస్తారని కేసీఆర్ " అంటున్నారు. ఎవరు విభజన వాదులూ? పచ్చని రాష్ట్రాన్ని విడదీసింది ఈ కేసీఆర్ గారి అధికార దాహం కాదూ? కాదు లెండి తెలంగాణా వారి ఆకాంక్ష అంటారా? మంచిదే. ఇప్పుడు ఆంద్రాని విడదీయాలి ముక్కలు ముక్కలుగా అని అలోచిస్తూ ఆంధ్రామీద పెత్తనానికి తహతహ లాడుతున్న కేసీఆర్ గారిని విభజన శక్తిగా చూడాలా ఐక్యతా శక్రిగా చూడాలా?  ఆయనకు ఈమద్య ప్రథాని పదవిపై మోజుపుట్టింది. దాని వెనుక ఆలోచన అల్లా, తాను ప్రథాని ఐతే ఆంద్రాని అణగద్రొక్కవచ్చును అన్న అలోచన కాదా అని అనుమానించ తప్పదు.

ఎన్నడూ ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి అన్నట్లు ప్రవర్తించే కెసీఆర్ గారి మాటను ఎలా నమ్మటం? ఆయన అవసరార్థం ఇప్పటికి  ఇచ్చిన ఎన్నో గొప్ప వాగ్దానాల్లాంటివే ఈనాడు జగన్ గారిని గెలిపించాలన్న తాపత్రయంలో తర్వాత చూసుకోవచ్చులే అన్న ధోరణిలో ఉదారంగా చెప్తున్న అందమైన మాటలూ వాగ్దానాలూను అని అంద్రాజనం అర్థం చేసుకోలేరా?

ఒకపక్కన "తెలంగాణకు కుట్రలు చేయడం రాదు" అంటూనే తెలంగాణా ముఖ్యమంత్రిగారు చేస్తున్న అతిపెద్ద కుట్ర ఆంద్రావాళ్ళకు మెరమెచ్చు మాటలు చెప్పి, తన చెప్పుచేతల్లో "బాంచన్ దొర కాల్మొక్త" అనే స్థాయిలో పడుండటానికి సిధ్ధంగా ఉన్న వ్యక్తిని గద్దెకెక్కించి ఆంధ్రాను నిలువునా ముంచి, ఆంద్రాజనాన్ని తెలంగాణా అభివృధ్ధికి వెలగా వెలగాలని ఆలోచించటం. కాదంటారా?

ఇంకొక ముఖ్యవిషయం. నిజంగా జగన్ గారు బ్రహ్మాండంగా - ఎంత బ్రహ్మాండంగా అంటే చంద్ర్రబాబుగారికి (ఇంక అయన గారి పార్టీమాట చెప్పాలా?) అసలు డిపాజిట్ అన్నదే రాకుండాపోయేంత బ్రహ్మాండంగా - జగన్ గారు విజయాట్టహాసంతో గెలిచే పక్షంలో, ఇప్పుడు ఆఖరుకు ప్రచారం ఇంకో  రోజులో ముగియ బోతున్నది అనగా ఆ జగన్ గారిని అరచేత్తో పైకెత్తుతూ ఈ అద్భుతమైన సుహృద్భావ ప్రకటనను మన కేసీఆర్ మహాశయులు చేయవలసిన అవసరం ఏముంటుంది? గమ్మున ఉండవచ్చును కదా. సమయం వచ్చినప్పుడు ఆ హోదాకు మద్దతు ఇచ్చేదీ మానేదీ చూసుకొవచ్చుననీ? మరి యెందుకు తొందర పడ్డట్టూ? అంటే అయనకు స్పష్టంగా అవగాహనకు వచ్చి ఉండాలి, తమ ప్రియతమ కొత్త (తాత్కాలిక) మిత్రుడు జగన్ గారు ఓడిపోబోతున్నాడనీ? అందుకే యధాప్రకారం తనదగ్గర ఏవో సర్వేల తాలూకు స్పష్తమైన రిపోర్టుల ప్రకారం జగన్ గెలిచేస్తున్నాడన్న బుకాయింపుతో సహా ఈ ప్రత్యేకహోదా గురించిన చిలకపలుకులు వల్లించారు!

ఇంకా కేసీఆర్ గారు మంచివారూ, ఆంద్రాని స్వయంగా పూనుకొని అభివృధ్ధి చేయ బోతున్నారు అని ఎవరన్నా నమ్ముతుంటే వారికో దండం.