9, ఏప్రిల్ 2019, మంగళవారం

శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని


శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని
మీరు భజించరు నోరార

శ్రీరఘురాముడు  సీతారాముడు
కోరినవరములు  కురియడా
తారకనామపు చేరిక నోటికి
ఔరా చేదా కారమా

హరుడే నిత్యము నారాధించెడు
హరినామము చేదైనదా
నరులకు శ్రీహరిస్మరణము కంటెను
తరణోపాయము ధరనేదీ

పామరులారా ప్రకృతివశులై
ఈ మేదిని నిటు లెన్నాళ్ళు
రామ రామ శ్రీరామా యంటే
ఆ మోక్షము మీ కందదా

3 కామెంట్‌లు:

 1. భాసాంద్రత కొరవడిన పాటలు ప్రచురించకండి. consider a break. You have already created many gems. I am taking the liberty to say this. A few examples I will recall. Sachin never knew when to stop. Likewise ilayaraja who created masterpieces in 80s made pathetic music in later days. No disrespect intended sir. I openly said my views.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరొక ముఖ్యమైన మాట 'consider a break' అన్నది. మీరు ఈ కీర్తనాసాహిత్యాని పరిశీలిస్తే రోజులతరబడీ, నెలలతరబడీ కూడా ఒక్క కీర్తనా వెలువడని సందర్భాలు కనిపిస్తాయి. వాటిని మీరు breaks అనవచ్చును. అవేవీ నేను కావాలని తీసుకున్నవి కావు. కొన్ని సందర్భాల్లో ఒకేరోజున చాలా కీర్తనలు వెలువడ్డాన్నీ మీరు గమనించవచ్చు. అవేవీ కూడా నేను కావాలని చేసిన exercises కావు. ఎవరికైనా అసక్తి ఉంటే ఒక్కమాట ఇక్కడ record చేయదలచాను. నేను కావాలని ముచ్చటపడ కూర్చొని ఒక్కకీర్తన కూడా compose చేయలేను. అటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ విఫలమే అయ్యాయి.

   తొలగించండి
 2. మీ అభిప్రాయం గమనించాను. అన్ని కీర్తనలూ ఒకే ధోరణిలో ఉండవు. అలాగే అన్నింటిలోనూ ఒకే బిగి ఉండదు. ఐనా ఇవేవీ కూడా నేను తీరికగా కూర్చుని చిత్రికపట్టి వ్రాసినవి కావు. ఈవిషయం కొందరు గమనించే ఉండవచ్చును. ఈ సమయంలో వ్రాయాలనో, ఇంతసమయంలో ఒక కీర్తనను కూర్చాలనో లెక్కలు వేసుకొని వ్రాయటం నాకు సాధ్యపడదు. ఎప్పుడేది వస్తే అప్పుడది అలాగే వెలువడుతూ ఉంటుంది. ఇంక భావసాంద్రత అంటారా, అది కూడా అన్నింటిలో ఒక్క లాగే ఉండటం కష్టం. వచ్చిన కీర్తన వచ్చినట్లే ప్రకటిస్తున్నాను. తరచుగా ట్యూన్ చేసుకొని ఆనందించటం అంత సులభం కాదు. ఇది ఒక సాకు వంటిదే కావచ్చును. కాని ట్యూన్ చక్కగా అనిపించినప్పుడు అంత చిక్కదనం లేని సందర్భాల్లోనూ కీర్తన రమ్యంగా ఉండవచ్చును. ఐనా మీ అభిప్రాయం పరిగణనలోనికి తీసుకుంటాను. మరింత శ్రధ్ధవహించటానికి యత్నిస్తాను.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.