16, ఏప్రిల్ 2019, మంగళవారం

జీవు డున్నతిని చెందే దెట్లా


జీవు డున్నతిని చెందే దెట్లా
దేవుడు వీడని తెలిసే దెట్లా

వచ్చిన పిదపనె పట్టిన వన్నీ
యిచ్చట వదలి యెటుపోవలెనో
ముచ్చట లన్నీ మూడునాళు లని
మెచ్చని జీవుడె మేలు కాంచును

ఎన్నిజన్మముల నెత్తిన గాని
తిన్నగ నీశ్వరు తెలియగ రాదే
పన్నుగ నీశుని భావించనిదే
చెన్నుగ మోక్షము చెందగ రాదే

చెవిలో శివుడే చెప్పిన నామము
భువిని జనించియు పొలుపుగ పాడి
ఎవడు దేవుడని యెఱుగును రాముని
చివరకు వాడే చెందును మోక్షము