15, ఏప్రిల్ 2019, సోమవారం

రాముడు మనసున రాజ్యము చేయక


రాముడు మనసున రాజ్యము చేయక
యేమి లాభము జన్మమెత్తి వీడు

కామాతురు డనగ కాసిన్ని దినములు
భూమిపై తిరిగిన నేమగును
కామన లుడుగని కతన మరల పుట్టి
భూమిని భ్రమియించి పోవును కాని

ఎవరెవరో గురువు లవసర దైవములు
ఇవలకు నవలకు నేమిత్తురు
భవమోహ ముడుగక భువిని మరల పుట్టి
ఎవరెవరినో కొలిచి యేగును కాని

తెలివిడి కలిగించు దేవుడు రాముడు
కలుషము లణగించి కాపాడు
తెలిసి శ్రీరాముని కొలిచిన నిక పుట్ట
వలసిన పనిలేని వాడగు కాని