2, ఏప్రిల్ 2019, మంగళవారం

దేవుడు రాముడై దిగివచ్చినాడు


దేవుడు రాముడై దిగివచ్చినాడు
దేవేరిని సీతగా తెచ్చుకొన్నాడు

నరులు వానరు లనిన నాకేమి భయమని
గరువాన రావణుడు కమలాసనుని
వరము లడుగు నప్పుడు వారల విడచె
హరిమాయయే వాని పొరబడగ జేసె

రావణుని కథ నెఱిగి దేవుడే నరుడిగా
భూవలయమున తాను పుట్టినాడిదే
రావలసిన కాలము రాక మానదుగద
శ్రీవిభున కుపాయము చిక్కకుండునా

కామాంధుడై వాడు కదలివచ్చినాడు
భూమిజాతను గొంచు పోయె లంకకు
రాముడు రావణుజంపి భూపుత్రిని గూడి
భూమినేలె మహావైభోగము చెలగ