9, ఏప్రిల్ 2019, మంగళవారం

నీయాజ్ఞ లేకున్న నేనేమి సేయుదును


నీయాజ్ఞ లేకున్న నేనేమి సేయుదును
వేయేల నాయునికి నీయిఛ్చయే కదా

నీమముగ నిన్ను పొగడ నిశ్ఛయించుకొని నేను
భూమిపైన నిలచితినా రామచంద్రుడ
నీమహాద్భుతలీల నిలుపు నన్నిచట గాక
యేమేమో పాడించునే కాక యేమందును

మరికొన్నినాళ్ళు నేనుమానక నీ రీతినే
పరమాద్భుతమైన నీ ప్రభావంబును
మరలమరల పాడుచు పరవశింతునా రామ
కరుణించి పాడించగద వయ్య నన్నెపుడు

మున్ను పాడినవారు మురిసి మోక్షార్హులై
నిన్ను పొందిరి కాన నీవు నన్నిపుడు
నిన్ను గూర్చి పాడగ నియమించుచున్నావు
సన్నుతాంగ రాఘవ జరుగనీ నీయాజ్ఞ