10, ఏప్రిల్ 2019, బుధవారం

పూవైనా ముల్లైనా పుట్టించిన దతడే చావైనా బ్రతుకైనా సంరక్షకు డతడే


పూవైనా ముల్లైనా పుట్టించిన దతడే
చావైనా బ్రతుకైనా సంరక్షకు డతడే

సంతసమా సౌఖ్యమా చక్కగ వాడిచ్చినవే
అంతులేని ధుఃఖమా అదియును వాడిచ్చినదే
వింతయైన సృష్టి నెల్ల వెలయించిన వాడతడే
చెంతనే యుండి కంటికి చిక్కని వాడతడే

మేలైనా చేటైనా మేదిని నత డిచ్చినదే
కాలోచిత మైన దెల్ల కలిగించెడు వాడతడే
లోలోపల దాగియుండి లొల్లిపెట్టు వాడతడే
ఏ లోకపు జీవికైన నీశ్వరు డతడే

మొన్న రాముడనగ పుంసాంమోహను డైనది వాడే
నిన్న కృష్ణుడగుచు మన్ను తిని నవ్విన వాడతడే
అన్ని రూపములను తోచి యలరారు ఘను డతడే
ఎన్నగ జీవులకు ముక్తి నిచ్చువా డతడే

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.