11, ఫిబ్రవరి 2021, గురువారం

లెక్కలు డొక్కలు నెందుకు

లెక్కలు డొక్కలు నెందుకు మీకు చక్కగ నామం చేయండి

మిక్కలి శ్రధ్ధగ చేయుట ముఖ్యం లెక్కలతో పని లేదండీ


ఎంతోశ్రధ్ధగ రామనామమే యెవ్వరు చేయుచు నుండెదరో

సంతోషముగా రామనామమును చక్కగ పలుకుచు నుండెదరో

అంతకంతకును రామానుగ్రహ మందుకొనుచు తాముండెదరో

చింతలుచీకాకులు వారలను చేరనె చేరవు నమ్మండీ


అక్షరలక్షలు చేసినంతనే హరి మీవాడై పోడండీ

నిక్షేపంబగు జపము చాలును నిత్యము లెక్కలు వద్దండీ

పక్షివాహనుడు మిమ్మడిగేది భక్తి మాత్రమని తెలియండి

రక్షకుడైన హరిని నమ్ముకొని రామనామమును.చేయండీ


రామరామ యని సీతారామ యని రామనామమును చేయండీ

రామచంద్ర హరి రఘురామా యని రామనామమును చేయండీ

రామహరే శ్రీకృష్ణహరే యని నామజపమునే చేయండీ

రాముని దయతో జపసిధ్ధిగని రయమున మోక్షము పొందండీ