11, ఫిబ్రవరి 2021, గురువారం

మంత్రాలకు లెక్కలూ‌డొక్కలూ‌ అంటే ఏమిటి?

ఈ మధ్యన లెక్కలు డొక్కలు నెందుకు అన్న కీర్తన వెలువరించాను. దాని గురించిన ప్రశ్న ఒకటి విన్నకోట నరసింహారావు గారు అడిగారు, రామకోటి గురించా అని.  క్లుప్తంగా వివరిద్దాం అంటే అది కాస్తా పెరిగి ఒక వ్యాసం ఐపోయింది.

మంత్రానుష్ఠానవిధానం అని ఒకటి ఉంటుందండి. వీలైతే ఎప్పుడన్నా దాన్ని స్పృశిస్తాను. ముఖ్యంగా మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలసార్లు ఆ మంత్రాన్ని జపం చేయటం అన్న లె ఒకటి ప్రముఖంగా పునశ్చరణ అన్న పేరుతో చాలా అవసరంగా భావించబడుతూ ఉంటుంది.

ఈ లెక్కను సరిగా నిర్వహించేందుకు గాను సాధకులు వ్రేళ్ళకణుపులనూ, జపమాలలోని పూసలను లెక్కిస్తూ ఉంటారు. మళ్ళా ఇందులో ఎలా లెక్కిస్తే (బతటకు ఉఛ్ఛరించటం, పెదవులు మాత్రం మౌనంగా కదపటం, మనస్సులోనే జపించటం వగైరా) అది సరైన విధానమూ అన్న చర్చ కూడా ఉంది. మరలా ఈ పురశ్చరణలో భాగంగా తర్పణము,హోమము, మార్జనము, బ్రాహ్మణభోజనమూ అన్న ఉపాంగాలుంటాయి. మరలా జపం చేసేందుకు శుచి, అహార్యము, స్థానము, ఆసనము, మౌనము వగైరా ఉపాంగాలుంటాయి. కొన్ని కొన్ని మంత్రాలకు జపాత్పూర్వం సంస్కారం అన్న క్రియాకలాపం ఉంటుంది. ఇవన్నీ నిర్వహించేందుకు విధివిధానాలూ లెక్కలూ ఉన్నాయి. వాటిలో‌ మళ్ళా ప్రత్యామ్నాయాల లెక్కలూ ఉన్నాయి.  ఈ వ్యవహారం అంతా ఉపదేశం పొందిన మంత్రానికి అనుష్ఠానం చేయటానికి అవసరం అని సంప్రదాయం.

ఇది కాక మీరన్నట్లు మనబోటి సామాన్యులకు రామకోటి వంటివి వ్రాయటం అన్న సులభోపాయం‌ ఉందనే ఉంది. మంత్రంలోని అక్షరాల సంఖ్యతో నిమిత్తం లేకుండా మంత్రాన్ని స్మరిస్తూ కోటిసార్లు దాన్ని లిఖించటం అన్నది దాని విధి. సంప్రదాయికం కేవలం రామకోటి మాత్రమే. ఆధునిక ప్రయోగంగా ఏ యిష్టదైవం నామం ఐనా కోటిలేఖనం చేయటం అన్నది ఈమధ్య పుట్టుకొని వచ్చింది.

ఇదంతా ఎందుకూ‌ అంటే మనస్సుకు మంత్రం మీద గురి కుదిరేందుకు గాను భక్తితో నిష్ఠగా చేయటం అన్నది విధానంగా ఏర్పరచినట్లు తోస్తున్నది.  పూర్వం స్వయంగా కొందరు ఉపాసకులు ఈమత్రం ఎన్నిలక్షలు చేయాలీ రోజుకు ఎన్ని వేలూ ఆలా ఎన్నేళ్ళూ అంటూ లెక్కలు వేయటం చూసాను. వారి దృష్టి అంతా అసలు మంత్రం మీద కన్నా లెక్కలు సరిగా నిర్వహించటం మీదే ఉండే ప్రమాదం ఎంతైనా లేదా?

శ్రీమధ్భాగవతంలో ద్వితీయసస్కంధంలో ఒకానొక ఖట్వాంగుడనే రాజుగారి కథ వస్తుంది. ఇంద్రుడు కోరితే, ఆయన దేవతల పక్షాన రాక్షసులతో పోరాడాడు. దేవాసురసంగ్రామం ముగిసి దేవతలు గెలిచారు. అప్పుడు ఇంద్రదేవుడు ఆనందంగా రాజుగారూ, మీరు వరం కోరుకోవాలీ అన్నారు. ఆయనేమో అన్నాడూ దేవరాజా, నాకెంత ఆయుర్దాయం మిగిలి ఉందో చెప్పండి చాలు అన్నాడు. దేవతలు ఆశ్చర్యపోయీరు. సరే లెక్కచూసి అయ్యో రాజుగారూ మీకు ఇంకొక్క ముహూర్తం మాత్రమే ఆయువు మిగిలి ఉందీ అన్నారు. ముహూర్తం అంటే రెండు ఘడియలు (అంటే 2x24=48ని.) వెంటనే భూలోకానికి వచ్చి సర్వం తక్షణం త్యజించి, ఈ స్వల్పకాలం లోనే ఆ ఖట్వాంగ చక్రవర్తి గోవింద నామస్మరణ త్రికరణశుథ్థిగా చేసాడు. ఆ నామ ప్రభావంతో ఆయన మోక్షం సంపాదించుకున్నాడు.

అందుచేత త్రికరణశుధ్ధిగా భగవంతుడి యందు మనస్సు నిలపటం ముఖ్యం కాని లెక్కలూ డొక్కలూ ఏమాత్రమూ ముఖ్యం కావని వ్రాసాను కీర్తనలో.

సకల వేదశాస్త్రాలూ వాటి అద్యయనాదులూ కేవలం‌ మనశ్శుధ్ధిని సంతరించుకొనేందుకు మాత్రమే అని పెద్దల నుడి.  ముల్లును ముల్లుతో‌ తొలగించి రెండు ముళ్ళూ విసిరి వేయాలీ అన్నట్లుగా ధ్యేయం ఐన మనశ్శుధ్ధిని సాధించి చిత్తం భగవదధీనం చేయటం మీద దృష్టి ఉండాలి కాని ఈ ఉపకరణాల యొక్కా లెక్కల యొక్కా గడబిడల్లో చిక్కుకోకూడదు.

ఈరోజు ఎంత సేపు రామనామం చేసానూ? మొన్న గడియారం సహాయంతో‌ లెక్కిస్తే, నిముషానికి ఎన్నిసార్లు అని లెక్కకు వచ్చిందీ. ఇలా ఐతే‌ నెలకు ఎంత? ఏడాదికి ఎంత? ఇలాంటి లెక్కల్లో పడి రాముడి మీద కాక లెక్కమీదనే దృష్టి ఆగిపోతే నామజపం వృధా అవుతున్నది. ఈ సంగతిని విశదం చేయటమే ఈ‌కీర్తన ఉద్దేశం.

4 కామెంట్‌లు:

  1. ఉద్యోగం కోసం, ఆర్ధిక ఇబ్బందులకోసం పూజలూ జపాలూ చేస్తే ఫలితం ఉంటుందని పూర్వీకులు చెప్పారు. కోతిలాంటి మనసుని కుదురుగా నిలబెట్టడం కోసం అన్నివేలసార్లు జపం చేయండి అని చెప్పారనుకుంటున్నాను. మీలాంటి రామభక్తులకు ఆ అవసరం ఉండదు కానీ సామాన్యులకు అవసరమే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నది నిజమే. జపంలో‌ కామ్యకజపం కూడా ఒక విధానమే నండీ. తప్పులేదు. దృష్టి మంత్రం పైన ఎంత చక్కగా నిలుస్తే ఫలితం అంత చక్కగా ఉంటుంది. సంప్రదాయం చెప్పే మాట ఏమిటంటే మంత్రమూ మంత్రాధిష్టానదైవతమూ వేరు అనుకోరాదు - ఆ రెండూ ఒకటే అని త్రికరణశుధ్ధిగా తెలియాలి. లెక్కవేయటం సరిగా అభ్యసించిన వారికి యాంత్రికంగా అది కుదురుతుందని అనుకుంటాను దృష్టి చెదరకుండానే. కాని అనేకులు అది సాధ్యపడక ఇబ్బందిపడటం జరుగుతున్నది. లెక్క కన్నా మంత్రవిశ్వాసం ముఖ్యం అని చెప్పటం మాత్రమే నా ఉద్దేశం.

      తొలగించండి
  2. చక్కగా విశదీకరించారు, శ్యామలరావు గారు.
    సంప్రదాయక పద్ధతైన రామకోటి కొంత వరకు నయం అనుకుందాం. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఏదో తన మానాన తను వీలైనప్పుడు కూర్చుని వ్రాసుకుంటారు. ఏకాగ్రత కావాలి.

    ఈ మధ్య కాలంలో మరొక పోకడ మొదలైంది - సామూహికంగా లక్ష సార్లు, కోటి సార్లు చెయ్యడం. లక్షగళార్చన, కొన్నిటిని కోటి సార్లు పఠనం వగైరా కొన్ని ఉదాహరణలు. అటువంటి కార్యక్రమాల్లో భక్తి కన్నా షో చెయ్యడం ఎక్కువ, అదొక సోషల్ ఫాషన స్టేట్-మెంట్ లాగా తయారయింది అని నా అనుమానం (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సుమండీ. భక్తులెవరినీ నొప్పించడం నా ఉద్దేశం కాదు).

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.