28, ఫిబ్రవరి 2021, ఆదివారం

శివుడు మెచ్చిన నామమే

శివుడు మెచ్చిన నామమే చేయవయ్యా నీవు

భవజలధి దాటి బయటపడుదు వయ్యా


శివుని కన్న గురు వెవడు చెప్పవయ్యా మున్ను

శివుడు రామమంత్రమును శ్రేష్ఠమనుచును

వివరించిన సంగతిని విస్మరించి ఏవేవే

వివిధమంత్రములను జేయు వెఱ్ఱి యేల


కాశి చేరి కనుమూసెడు ఘనులకు చెవిలోన

నీశానుడు రామ మంత్ర మెసగ నిచ్చునే

మానవులకు భవతారక మంత్రమదే కాన

మానక నది చేయుటే మంచి పధ్ధతి


శివుడు తా నెపుడు జేయు శ్రీరామ నామమే

పవలు రేలు జేయవలయు భక్తిమీఱగ

భవము గివము మిమ్మింక బంధించజాలదు

చివరి జన్మ మిదే యగును శివుని యాన