4, ఫిబ్రవరి 2021, గురువారం

మట్టిబొమ్మ తోలుబొమ్మ

 మట్టిబొమ్మ తోలుబొమ్మ మతిలేని మాయబొమ్మ

ఇట్టే దారితప్పితిరుగు నీపిచ్చి నీటిబొమ్మ


చెట్టుమీది కోతివోలె చెంగుచెంగు నెగురుబొమ్మ

పుట్టలోని చెదలవలె పుట్టిచచ్చుచుండు బొమ్మ

మట్టినుండి పుట్టుబొమ్మ  మట్టిలోన కలయుబొమ్మ

గట్టిగ పదినాళ్ళకంటె నెట్టలేని వెఱ్ఱిబొమ్మ


సింగారముమీద పిచ్చి చెదిరిపోని చచ్చుబొమ్మ

బంగారమునందు భ్రాంతి వదలలేని భలేబొమ్మ

నింగిమీది కెగురుబొమ్మ నేలమీది కొఱుగుబొమ్మ

భంగపరచు కాలమని భావించగలేని బొమ్మ


ఇట్టి బొమ్మ నొకటిచేసి యిందు నన్నుండ నీవు

పట్టుబట్టి పనిచినావు పరమాత్మా రామచంద్ర

ఇట్టే నిన్ను మరచిపోయి యెగురుచున్న బొమ్మనై

ఎట్టకేలకిపుడు నిన్నే యెంచిపొగులుచుంటి గనుమ