20, ఫిబ్రవరి 2021, శనివారం

పరాకుపడితే ఎట్లాగయ్యా

పరాకుపడితే ట్లాగయ్యా పట్టాభిరామయ్యా నీవు

బిరాన రక్షించాలి గదయ్యా వీరరాఘవయ్యా


కౌసల్యాసుఖవర్ధన నీవు కరుణాళుడవయ్యా

దాసులసేమమ మరువరాదురా దశరథరామయ్యా

దోసములెంచక దాసులనేలగ దోర్బలరామయ్యా

గాసినిబెట్టే కలిని తరుమగా గమ్మనరావయ్యా


ఆనా డందరు రాకాసులనే నణచితి ననకయ్యా

ఈనా డెందరు రాకాసుల కిల యిరవో కనవయ్యా

నానాబాధలపాలై ధర్మము నలుగుట కనవయ్యా

మానవనాథా నీభక్తులగతి మానక కనవయ్యా


దైవతగణముల పరువునిలుపగ త్వరగ రావయ్యా

దైవద్రోహుల నణచగ రారా తండ్రీ రామయ్యా

భావాతీతప్రభావాదేవా పరుగునరావయ్యా

నీవేదిక్కని నమ్మిన వారిని కావగరావయ్యా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.