4, ఫిబ్రవరి 2021, గురువారం

రాముని నీవు తలంపక

రాముని నీవు తలంపక నిచ్చట నేమని తిరుగుచు నున్నావు

పామరుడా నీ వయ్యో దుర్భరభవసాగర మెటు లీదేవు


ప్రతిజన్మంబున ధనధాన్యములకు పరిదేవనము చేసేవు

ప్రతిజన్మంబున సతీసుతులనే బహుబంధంబుల తగిలేవు

ప్రతిజన్మంబున నాధివ్యాధులను వ్యాధుల చేతికి చిక్కేవు

హితకరుడగు శ్రీరాముని నామము నెన్నడు తలచక యుండేవు


పరాయివారల వైభవముల గని బహుదుఃఖమునే పొందేవు

పరాయిధనములపై దురాశతో బహుయత్నములే చేసేవు

పరాయివానిని చేసి బందుగులె పరిభవించితే పొగిలేవు

విరాగి వెన్నడు కావు రాఘవుని స్మరణము చేయక గడిపేవు


మరలమరల నీధరకేతెంచుట మంచిదికాదని తెలియవయా

జరామరణ దూషితముల తనువుల సంపాదించుట మానవయా

సురవర నరవర వంద్యుని రాముని సొంపుగ మనసున తలచవయా

అరరే చెడినది చాలిక రాముని యాశ్రయించి తరియించవయాకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.