11, ఫిబ్రవరి 2021, గురువారం

రసనా విడువకే

రసనా విడువకే రామనామము 

అసలుసిసలు రక్ష నీకదే తెలియవే


ఎన్ని మంత్రములను నేర్చి యేమిఫల మున్నదే

తిన్నగా మోక్షమిచ్చు దివ్యమంత్రమనగ

అన్నిటికి మిన్నయైన అద్భుతమగు మంత్రమై

యున్న రామనామమునే యుపాసించవే


నిరంతరము హనుమదాది నిర్మలాత్మకులైన

పరమభక్తశిఖామణులు భావించుమంత్రమే

కరుణామయుడైనట్టి కమలాక్షుని మంత్రమే

నిరుపమానమంత్రమే నీస్వామి పేరు


బృందారసందోహానందవర్ధననామమే

అందమైన నామమే అద్భుతమగు నామమే

అందరికీ మోక్షమిచ్చు నట్టి దివ్యనామమే

అందిపుచ్చుకొని వదలక యనిశము జపించవే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.