3, ఫిబ్రవరి 2021, బుధవారం

చిత్తమా కోరకే

చిత్తమా కోరకే సీతారాముని నీవు

కొత్తకొత్త గొంతెమ్మకోరిక లిపుడు


అడిగినవన్నీ యిచ్చి ఆదరించు రాముని

అడుగరాని వడుగకే అలుసై పోకే

అడుగవలయునా నీ వతడికే తెలియదా

వడివడి నీకేమీయ వలయునో మనసా


చింతామణి చెంత నిలచి చింతకాయ లడుగకే

అంతవాని చిళ్ళపెంకు లడుగనెంచకే

చింతలుడిపి భక్తకోటి కంతులేని యానందము

సంతత మందించు వాని చెంతనున్న వేళ


నిన్ను నీ వర్పించు కొన్నావు గద యిక

చిన్న పెద్ద కోరిక లని చెప్ప నున్నవా

పన్నుగ నీ రాముని సన్నుతాంఘ్రియుగమున

నున్న వేళ ఒక కోరిక యుండు టున్నదా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.